కేటీఆర్‌తో సూపర్‌స్టార్‌.. ఇంట‌ర్వ్యూ

244
- Advertisement -

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సినిమా ప్రియుడన్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతగా.. మంత్రిగా ఫుల్ బిజీగా ఉండే కేటీఆర్.. కొన్నిసార్లు వీలు చూసుకుని సినిమాలకు వెళ్తుంటాడు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశాడు. అనంతరం మహేష్ బాబుతో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మహేష్‌ యువతకే కాదు అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆయనో సూపర్‌స్టార్‌. ఎంతో క్రమశిక్షణతో ఎదిగారు. ఇంత మంచి విజయాన్ని అందుకున్న మహేష్‌కు శుభాకాంక్షలు. ఇదివరకు 100 రోజులు 200 రోజులు ఆడేవి. ఇప్పుడు రూ.100 కోట్లు.. రూ.200 కోట్ల లెక్కల ప్రకారం ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మరిన్ని కలెక్షన్లతో విజయం పథంలో నడవాలి. అంతేకాదు మహేష్‌ కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ చిత్రంలో రెండు మూడు అంశాలు బాగా నచ్చాయి. ఒకవైపు సందేశం, మరోవైపు సక్సెస్‌ కావాలంటే సినిమాలో కచ్చితంగా నాటకీయత ఉండాలి. దాన్ని దర్శకుడు తీసుకున్నారు. సినిమాలో చెప్పిన జవాబుదారీతనం నాకు బాగా నచ్చింది. మనల్ని ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న సందేశం బాగుంది. ఇంకొకటి సువిశాల భారతదేశంలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి.

Mahesh Babu and KTR Interview

భారీగా కరెంట్‌ను ఉత్పత్తి చేసే దేశంగా పేరున్నా, ఇంకా విద్యుత్‌ లేని గ్రామాలు ఉన్నాయి. దేశంలో జీవనదులు ఉన్నా, గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లే పల్లె ప్రజలు ఉన్నారు. ఇలా ఎక్కడో ఒక చోట వ్యత్యాసం ఉంది. సినిమాలో మీరు లోకల్‌ గవర్నెన్స్‌ అంశాన్ని చెప్పడం కూడా బాగుంది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ దీనిని అమలు చేయబోతున్నారు. మూడోది విద్యా, వైద్యం అంశాలను కూడా చాలా చక్కగా చెప్పారు. చివరిగా మీడియా ఏరకంగా ప్రవరిస్తుందో కూడా చాలా బాగా చూపించారు. రోజు మేము పడే బాధను కూడా చూపించినందుకు మా తరపున ధన్యవాదాలు. సినిమాలో మహేష్‌ సీఎం అవగానే ట్రాఫిక్‌ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయి, నేను కూడా అలా చేస్తే మీరు(ప్రజలు) వూరుకోరు. అది నాకు తెలుసు. అయితే, సినిమా చూసి కాస్త సిగ్గుపడి తప్పు చేయకుండా ఉంటే చాలు’’ అని అన్నారు.

Mahesh Babu and KTR Interview

మహేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘మా సినిమా చూసిన కేటీఆర్‌ సర్‌కు ధన్యవాదాలు. (మధ్యలో కేటీఆర్‌ అందుకుని జస్ట్‌ రామ్‌ అని పిలవండి) ‘భరత్‌ అనే నేను’ బృందాన్ని కేటీఆర్‌ అభినందించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నా సినిమాలు చూసినా నాకు టెన్షన్‌. బాగుంటే బాగుందని చెప్తారు. లేకపోతే చెప్పరు. నాకు బాగా గుర్తు ‘ఆగడు’ చూసి ‘స్టాప్‌ డూయింగ్‌ నాన్సెన్స్‌ లైక్‌ దిస్‌’ అన్నారు. అంత నిజాయతీగా ఉంటారు. ఈ కథ చెప్పినప్పుడు రాజకీయాలకు గురించి నాకు తెలియదని చెప్పా. ఎందుకంటే నాలోకం అంతా సినిమానే! అదే నా జీవితం. దర్శకుడు శివకు రాజకీయాలపై మంచి పట్టుంది. ఎంతో పరిశోధన కూడా చేశారు. కథ మొత్తం చెప్పిన తర్వాత ‘ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే అవుదామన్న కోరిక ఉంది సర్‌’ అని చెప్పారు. (మధ్యలో కేటీఆర్‌ అందుకుని ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) ఇక సీఎం పాత్రను ఎలా చేద్దాం అని అడిగితే ‘బయట కేటీఆర్‌ ఎలా ఉంటారో మీరు కూడా అలా ఉంటే చాలు’ అని శివ చెప్పారు. ఈ సినిమాలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు!

అయితే ఈ సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్‌ను కొరటాల శివని అభినందించారు కేటీఆర్‌. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటర్వ్యూ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఈ సినిమా త‌న రియ‌ల్ లైఫ్‌కి కూడా కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో మూవీ హీరో మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో క‌లిసి ఇంటర్వ్యూ జ‌రిపారు. సినిమాలో ఉన్న అంశాలతో పాటు రియల్ లైఫ్ లో తాను ఫాలో అవుతున్న పద్దతులు గురించి చ‌ర్చించారు.

- Advertisement -