మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 17రోజులు గడుస్తున్న ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. కాగా సీఎం పదవి కాలం ముగుస్తుండటంతో సీఎం ఫడ్నసీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖను గవర్నర్ కు అందజేశారు. తాజాగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన ఆహ్వానించారు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న ఫడ్నవీస్‌కు ఈ మేరకు లేఖ రాశారు గవర్నర్. 105 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరిండచంతో బీజేపీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు.
అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా ఆయన కోరారు. కాగా మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే 145సీట్లు అవసరం. అయితే బీజేపీకి కేవలం 105మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఆలోచనలో పడింది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఎట్టిపరిస్ధితుల్లో మద్దతివ్వం అని చెబుతున్నాయి. నవంబర్ 11 సాయంత్రం లోపు బల పరీక్ష చేసుకోవాలని సూచించారు గవర్నర్. 288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది.
ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం పీఠంపై కన్నేసింది శివసేన. సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ కు బీజేపీ అంగీకరించకపోవడంతో సమస్య కొలిక్కి రావడం లేదు.