మహారాష్ట్ర ప్రభుత్వం నకిలీ పన్నీర్ తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది. సాంప్రదాయ పాల పన్నీర్‌కు, నకిలీ పన్నీర్‌కు ఉన్న తేడాలేమిటి? సరియైన లేబులింగ్ లేకపోవడం ఎందుకు ఆందోళన కలిగిస్తోంది? కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఏం తనిఖీ చేయాలి? అనే విషయాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
భారతీయ ఇళ్లలో పన్నీర్‌కు మొదటి నుండి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఉత్తమ ప్రోటీన్ మరియు కాల్షియం అందించే ఆహారంగా గుర్తింపు పొందింది. రెస్టారెంట్‌లో షాహీ పన్నీర్ తిన్నా, ఇంట్లో పన్నీర్ భుర్జీ చేసుకున్నా… తాము పాలతో చేసిన డైరీ ఉత్పత్తినే తింటున్నామని ఎక్కువ మంది భావిస్తారు. కానీ, అది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు.
ప్రజారోగ్యం మరియు తప్పుడు ఆహార లేబులింగ్‌పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో నాన్-డైరీ పన్నీర్ తయారీ, విక్రయం, నిల్వ మరియు పంపిణీని నిషేధించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. వినియోగదారులకు తెలియకుండానే పాలతో చేయని నకిలీ పన్నీర్‌ను సాంప్రదాయ పన్నీర్‌గా వడ్డిస్తున్నారనే ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, పోషకాహారం, పారదర్శకత మరియు ఆహార భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాంప్రదాయ పన్నీర్‌ను పాలతో తయారు చేస్తారు. ఇది సహజంగానే ప్రోటీన్, కాల్షియం మరియు ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కానీ నకిలీ పన్నీర్‌ను పాలతో కాకుండా కూరగాయల నూనెలు/కొవ్వులు , పిండి పదార్థాలు , ఎమల్సిఫైయర్లు మరియు కృత్రిమ రసాయనాల సహాయంతో తయారు చేస్తారు. భారతదేశంలో నాణ్యమైన ప్రోటీన్‌కు పన్నీర్ ఎల్లప్పుడూ అత్యుత్తమ వనరులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కానీ నేడు చాలామంది తింటున్నది అసలైన పన్నీర్ కాదు. రెస్టారెంట్లు, ఆహార విక్రేతలు పాల పన్నీర్‌కు బదులుగా కూరగాయల కొవ్వులు, స్టార్చ్ మరియు అడిటివ్‌లతో తయారు చేసిన అనాలోగ్ పన్నీర్‌ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రుచి మారడమే కాకుండా తాము అసలు ఏం తింటున్నామో వినియోగదారులకు తెలియకపోవడమే అతిపెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు.
సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే పన్నీర్ పాలలోని ప్రోటీన్, కాల్షియం మరియు ఇతర సహజ పోషకాలను ఇస్తుంది. కానీ నకిలీ పన్నీర్ (ముఖ్యంగా చౌకగా లభించే రకాలు) లో ప్రోటీన్ శాతం చాలా తక్కువగా ఉండి, రిఫైన్డ్ స్టార్చ్, నాసిరకం వెజిటబుల్ కొవ్వులు ఉంటాయి. దీనివల్ల శరీరానికి తగిన పోషకాలు లేదా కడుపు నిండిన భావన లభించకపోగా, కేలరీలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. అంటే, మీరు అనుకున్నంత పోషకాలు అందకపోయినా.. కడుపులోకి ఎక్కువ కేలరీలు వెళ్తాయి.
పన్నీర్‌లో సాధారణంగా కూరగాయల కొవ్వులు, పాలు కాని ప్రోటీన్లు, స్టార్చ్ మరియు ప్రిజర్వేటివ్‌లను కల్తీ చేస్తారు. ఇటువంటి పద్ధతులు పోషకాల నాణ్యతను తగ్గించడమే కాకుండా, ముఖ్యంగా తయారీ ప్రమాణాలు సరిగా లేనప్పుడు రసాయన మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ల (క్రిముల) ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్నారులు మరియు పోషకాహార లోపం ఉన్నవారు దీనివల్ల ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read:‘డిసి’తో బ్లాక్‌బస్టర్ హిట్!

