పొత్తు ఒకే…కానీ సీట్ల పరిస్థితేంటి…!

240
Mahakutami yet to decide on seat sharing
- Advertisement -

రాష్ట్రంలో పొలిటికల్ హిట్ పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్ని తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రచారం, మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 105మంది అభ్యర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్‌… ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దసరా తర్వాత సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా సభలు,సమావేశాలు నిర్వహించనున్నారు.

అయితే అధికార పార్టీ కంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక,ప్రచార సభలపై దృష్టి పెట్టాల్సిన విపక్షాలు కాసింత వెనుకబడ్డాయి. ఓటు చీలకుండా కాంగ్రెస్,సీపీఐ,టీడీపీ,టీజేఎస్ మహాకూటమిగా ప్రజల ముందుకువస్తోంది. అయితే పొత్తకు ఆయా పార్టీల్లో సుముఖత వ్యక్తమైన సీట్ల పంపకాల మధ్యే విభేదాలు తలెత్తుతున్నాయి.

119 శాసనసభ స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ కనీసం 90 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే కూటమిలోని తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి 50కి పైగా స్థానాలను కోరుతున్నాయి. దీంతో ఆదిలోనే మహాకూటమికి కష్టాలు మొదలయ్యాయి.

Image result for kodanda ram chada l ramana

టీడీపీ 30,సీపీఐ 5,తెలంగాణ జనసమితి 17 స్ధానాలు ఇవ్వాలని పట్టుబడుతుండటంతో సీట్ల కేటాయింపు నేతలకు తలనొప్పిగా మారింది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ కోరుతున్న స్థానాలపై కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమీక్షించుకున్నారు. కాంగ్రెస్‌ గెలిచే స్థానాలను ఇవ్వడం సాధ్యం కాదని ఆ పార్టీ ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు చెప్పింది.

ఇక పొత్తుతో తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ చీఫ్‌కు కోదండరాంలకు కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి పోటీ తలనొప్పిగా మారింది. జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికే అవకాశం దక్కనుండటంతో ఎల్‌ రమణ ఎక్కడినుండి పోటీ చేయాలో తేల్చుకోలేక పోతున్నారు.

ఇక సీపీఐ చాడ వెంకటరెడ్డిది ఇదే పరిస్థితి. 2004లో హుస్నాబాద్‌ నుంచి గెలిచిన ఆయన పొత్తులో భాగంగా తానే బరిలోకి దిగుతానని ప్రకటించారు. అంతేగాదు ఇప్పటికే సీపీఐ శ్రేణుల్నిక్షేత్రస్ధాయిలో సమాయత్తం చేస్తూ పోటీకి సై అంటున్నారు. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నుంచి తీవ్ర పోటీ నెలకొంది. కోదండరాంది కూడా ఇంచుమించు ఇదే పరిస్ధితి. వరంగల్ వెస్ట్,జనగామ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న కోదండరాంకు అక్కడినేతల నుంచి గట్టిపోటి తప్పడం లేదు. జనగామలో కాంగ్రెస్ కురువృద్ధుడు పొన్నాల బరిలో ఉండటం,ఈస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి సీటు ఆశీస్తున్నారు. దీంతో ఆయా పార్టీ రథసారథులకే సీట్ల పంచాయితీ తప్పడం లేదు. అయితే కూటమి పార్టీల ఉమ్మడి అజెండాలో ఏకాభిప్రాయం కుదిరిందని, సీట్ల సర్దుబాటు కూడా సమస్యలు లేకుండా జరుగుతుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -