మహాకూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్థుబాటు కొలిక్కి రాకపోవడంతో కూటమి నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ 9, టీజేఎస్‌కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మిత్రపక్షాలు కోరినన్ని సీట్లు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఇందుకు ఆ మూడు పార్టీలు ససేమీరా అంటున్నాయి. దీంతో కథ మళ్లీ మొదటికే
వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్నా.. ఇంకా సీట్ల పంచుకునే క్రమంలో ఉన్నారు. వారి సీట్ల పంచాయితీ ఎప్పుడు తేలాలి.. ప్రజల వద్దకు ఎప్పుడు చేరుకుంటారని రాజకీయంగా చర్చ జరుగుతోంది.
ఈ మేరకు కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ అయి, మిత్రపక్షాలు ఎన్ని కోరితే అన్ని సీట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి తన వల్ల కాకపోవడంతో ప్రజా కూటమి పేరుతో జానా రెడ్డి చేతిలోకి వచ్చింది. అయితే ఆయన కూడా సీట్ల పంపకాల్లో ఎటూ తేల్చలేక పోతున్నారు. ఇక కూటమిలో అనవసరంగా
చేరామని కోదండరాం, సీపీఐ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కోదండరాం, సీపీఐని బుజ్జగిస్తున్నారు. కోదండరాంకు డిప్యూటీ సీఎం లేదా రాజ్యసభ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. సీఎం కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించిన నేతలంతా తమ తమ ప్రచారాల్లో బీజీ అయ్యిపోయారు. ఇక కాంగ్రెస్, టీడీపీ నేతలు మాత్రం సీట్ల లొల్లితోనే కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో కూటమి నేతలు సీట్లు పంచుకునే లోపు తాము స్వీట్లు పంచుకుంటామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమయ్యేలా
ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.