దిశ ఘటన జరగడం చాలా బాధాకరం అన్నారు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత. దిశ హత్య ఘటనపై పార్లమెంట్ లో మాట్లాడారు ఎంపీ . ఈసందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దిశ లాంటి ఘటన పట్ల దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సిగ్గుపడాలి అన్నారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా పార్లమెంట్లో పోరాడి చట్టాలు తీసుకొస్తాం. దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు జరిగినా దోషులకు శిక్ష అమలు కాలేదన్నారు.
ఉరి శిక్ష వేస్తే వారం పది రోజులకు అమలయ్యేలా కేంద్రం చట్టం తీసుకురావాలి. దేశంలో ఏ ఆడపిల్ల జోలికి వెల్లలన్నా భయపడేలా శిక్షలు ఉండాలి. వరంగల్ జిల్లాలో 9 నెలల పసికందు పై అత్యాచారానికి పాల్పడితే స్థానిక కోర్టు ఉరిశిక్ష వేస్తే పై కోర్టుకు వెళ్లి యావజ్జీవ శిక్షగా మార్చుకున్నారు. శిక్షల అమలులో జరిగే జాప్యం వల్ల సమాజంలో భయం లేకుండా పోతుందన్నారు. దోషులకు వారం పది రోజుల్లోనే ఉరి శిక్ష అమలు చేసేలా చట్టం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మహిళా సంరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు.