బీజేపీ అమిత్ మాల్వీయాపై కేసు కొట్టివేత

2
- Advertisement -

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మాల్వీయా చేసిన సోషల్ మీడియా పోస్టు నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలే హేట్ స్పీచ్‌కు సమానమని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మంగళవారం ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. శ్రీమతి, మాల్వీయా పిటిషన్‌ను అనుమతిస్తూ కీలక తీర్పు ఇచ్చారు. 2023లో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను “జెనోసైడ్‌కు పిలుపు”గా అభివర్ణించిన మాల్వీయా పోస్టులో ఎలాంటి క్రిమినల్ అంశం లేదని ఆమె పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులనే లక్ష్యంగా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ కోణంలో మాల్వీయాను బాధితుడిగా కూడా చూడవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. డీఎంకేకు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదుతో తిరుచ్చి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

మాల్వీయాపై శత్రుత్వాన్ని ప్రేరేపించడం, ప్రజా శాంతి భంగం వంటి పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయితే, హేట్ స్పీచ్‌కు ప్రతిస్పందించిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుని, అసలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు లేవని కోర్టు ప్రశ్నించింది. “హేట్ స్పీచ్‌ను ప్రారంభించిన వ్యక్తిపై చట్టం ఎందుకు అమలు కావడం లేదు?” అని జస్టిస్ శ్రీమతి వ్యాఖ్యానించారు.

డ్రావిడ కజగం, ఆపై డీఎంకే హిందూ మతానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక సిద్ధాంత పోరాటాన్ని మాల్వీయా తరపు న్యాయవాది ప్రస్తావించగా, ఆ నేపథ్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మాల్వీయా పోస్టు ద్వేషాన్ని రెచ్చగొట్టేదిగా కాకుండా, మంత్రి వ్యాఖ్యల అసలు అర్థాన్ని ప్రశ్నించేదిగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.

ఉదయనిధి ప్రసంగంలో పదేపదే ఉపయోగించిన తమిళ పదం ‘ఒజిప్పు’ (Ozhippu – నిర్మూలనం/రద్దు)పై కోర్టు దృష్టి సారించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటే, దాన్ని అనుసరించే వారు ఉండకూడదన్న భావనకు దారితీస్తుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘సనాతన ఒజిప్పు అనే పదబంధం జెనోసైడ్ లేదా సాంస్కృతిక నిర్మూలనకు పిలుపుగా భావించవచ్చని పేర్కొంది.

మార్చి 2024లో ఇదే మద్రాస్ హైకోర్టు మరో కేసులో కూడా ఉదయనిధి వ్యాఖ్యలను హేట్ స్పీచ్‌గా వర్గీకరించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. “ఒక మంత్రి హేట్ స్పీచ్ చేస్తే, దానికి వ్యతిరేకంగా మాట్లాడటం నేరంగా పరిగణించలేం అని జస్టిస్ శ్రీమతి స్పష్టం చేశారు. మాల్వీయా ఎక్కడా హింసకు పిలుపునివ్వలేదని, ఎలాంటి ఆందోళనలకు కూడా పిలుపునివ్వలేదని కోర్టు తేల్చింది.

Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!

- Advertisement -