ముఖంపై చెరగని చిరునవ్వుతో అమాయకంగా కనిపిస్తూ ఎందరినో ఆకట్టుకున్నాడు ఉదయ్ కిరణ్… ‘చిత్రం’గా వెండితెరపై వెలిగి అనతికాలంలోనే మాయమయ్యాడు. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు మూడేండ్లు గడిచాయి. అతని మరణ విషాదం ప్రతీ ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. సందర్భం ఏదైనా వస్తే ఉదయ్ కిరణ్‌ను తలుచుకొని బాధపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతి ఏటా షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలకు మా అధ్యక్షుడు శివాజీ రాజా పురస్కారాలు అందించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమేనని, ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, బాధలో ఉన్న వారిని ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు ఉదయ్ కిరణ్ అని, అర్థాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్ ని సినీ పరిశ్రమ ఆదుకుని ఉంటే ఈ రోజు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడని, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదంటూ శివాజీరాజా ఉద్వేగానికి లోనయ్యారు. ఉదయ్ కిరణ్ పేరు నిర్వహించే కార్యక్రమానికి రావడం గర్వంగా ఉందన్నారు. మా సభ్యుడు అంతకంటే నాకు మంచి మిత్రుడని.. నాకే కాదు శ్రీకాంత్, తరుణ్‌కు చాలా మందికి సన్నిహితుడు అని శివాజీ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం చూస్తుంటే ఉదయ్ కిరణ్ బతికి ఉన్నాడనే అనిపిస్తున్నది అని అన్నారు.