హాస్యనటుడు విజయ్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ బలవన్మరణంపై పలువురు నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా ఉంటే తమతో చెప్పుకోవాలని… అలా కాకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల నటులపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు.
గతంలో సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబం మొత్తం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. నటీనటులకు ‘మా’ చేయూతను ఇస్తోందని తెలిపారు. ఒత్తిళ్లకు గురైనవారికి అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని తెలిపారు.