‘మా’ ఎన్నికలు.. పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్‌..

113
Bandla Ganesh
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో “మా” ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మా అధ్యక్షడి బరిలో మంచు విష్ణు,ప్రకాష్‌ రాజ్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇటీవల నామినేషన్ల స్వీకరణ కూడా జరిగింది. ఈ ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించానున్నారు.

ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ మరో షాక్‌ ఇచ్చారు.. ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇటీవల ప్రకాష్‌ రాజ్ ప్యానెల్ నుంచి బయటికి వచ్చిన బండ్ల గణేష్‌ ‘మా’ ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, తాజాగా చేసిన ప్రకటనలో తాను ‘మా’ ప్రధాన కార్యదర్శి పదవికి దాఖలు చేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని స్పష్టం చేశారు. ఇటీవల ప్రకాష్‌ రాజ్ ప్యానెల్లో జీవిత చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బండ్ల గణేష్‌ బాహాటంగానే తన మనోభావాలను వెలిబుచ్చారు. జీవితను ఓడించేందుకే ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు.

కొన్నిరోజుల కిందట కూడా బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా వెనుక ఎవరెవరున్నారో మీకు తెలియదు… నా గెలుపు ఖాయం అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతలోనే… నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. బండ్ల గణేష్‌ తన నివాసంలో ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి ఆ ఫొటోలో దర్శనమిచ్చారు.

- Advertisement -