లక్కీ భాస్కర్..వైవిధ్యమైన చిత్రం!

3
- Advertisement -

వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్ గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ యాప్ట్. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలను కూడా వెంకీ తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథని ప్రభావితం చేయకుండా సినిమాలో ఒక్క పాత్ర కూడా లేదు. బ్యాంక్ లో బయట నిలబడే సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరూ మనకొక ఎమోషన్ క్రియేట్ చేసి వెళ్తారు ఈ సినిమాలో. దుల్కర్ సల్మాన్ వేరే లెవెల్ లో యాక్ట్ చేశాడు. అంటే ఎఫర్ట్ లెస్ గా చేశాడు. అంటే నిజంగా ఒక బ్యాంక్ లోకి వెళ్ళిపోయి, క్లర్క్ జీవితంలోకి ఎంటరైతే ఎంత ఈజీ ఉంటుందో అంత ఈజీగా చేశాడు. మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్ లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన రోడ్డు తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మమ్మూట్టి గారు చాలా గొప్ప నటుడు. ఆయన దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నా మనసుకు దగ్గరైంది. ఈ సినిమాలో నేను అందరికంటే ఎక్కువ ఫ్యాన్ అయిపోయింది అంటే రాంకీ గారి పాత్ర. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే నెగ్గాలని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది అక్కడినుండే వచ్చాము కదా. అడ్వెంచర్ చేసి, దాని నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడటం అనేది హోప్. ఆ హోప్ సినిమా చూసిన తర్వాత ఫైనల్ గా కంప్లీట్ అవుతుంది. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే విజయ్ గురించి రెండు మాటలు చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకడు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. మా వాడే మహా గట్టివాడే అని.. మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు. దుల్కర్ గారిని నేను పెద్దగా కలవలేదు. షూటింగ్ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను నేను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను. ఇండియన్ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్ మలయాళం సినిమాలో ఒక మైల్ స్టోన్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా నాగవంశీకి, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.” అన్నారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అభిమానులను కలిసి చాలారోజులు అవుతుంది. మీరందరూ సంతోషంగా, బాగున్నారని కోరుకుంటున్నాను. నా సోదరుడు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్ కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. రాసిపెట్టుందేమో ‘VD12’ నేను, గౌతమ్ సితారలో చేయాలని. త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్ లో ఒక బిగ్ మూమెంట్. మన జనరేషన్ కి తెలుసు మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమానుల్లో దర్శకుల్లో ఒకరు. ఆ తర్వాత ఆయనను చాలాసార్లు కలిశారు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి త్రివిక్రమ్ గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చోవచ్చు. ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి. లక్కీ భాస్కర్ తో వెంకీ ఒక కొత్త లెవెల్ అన్ లాక్ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి పాత్ర లభించిందని అర్థమవుతోంది. నేను నటుడు కాకముందు నుండే దుల్కర్ సినిమాలు చేస్తుండేవాడిని. మేము మహానటి, కల్కి సినిమాలు కలిసి చేశాను. నా సోదరుడు దుల్కర్ సినిమా వేడుకకు రావడం సంతోషంగా ఉంది. దుల్కర్ కి, సితారకి, వెంకీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.

Also Read:TTD: తిరుమలలో విశేష పర్వదినాలు

కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఇదొక కొత్త జానర్ సినిమా. ఇదొక కొత్త ప్రయత్నం. ఇలాంటి సినిమా నిర్మించడానికి ముందుకు రావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం వంశీ గారికి ఉంది. వెంకీ గారు చూడటానికి కాలేజ్ స్టూడెంట్ లా ఉంటారు. కానీ ఆయన రాసే సన్నివేశాలు, మాటలు గొప్పగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో నటించడం నటీనటులకు చాలా తేలికగా ఉంటుంది. తేలికగా ఆ పాత్రలలోకి, ఆ సన్నివేశాల్లోకి వెళ్ళిపోతాము. అందరం కలిసి ఒక కుటుంబంలా ఈ సినిమా చేశాము. అందరితో మంచి అనుబంధం ఏర్పడింది. మీనాక్షి అందంగా ఉండటమే కాదు, అంతే అందంగా నటించింది. ఈ సినిమాకి నేను మూడు భాషల్లో డబ్ చేశాను. ఈ సినిమాలో మీనాక్షి పాత్ర అందరికీ గుర్తుంటుంది. రిత్విక్ చాలా బాగా నటించాడు. త్రివిక్రమ్ గారికి నేను పెద్ద అభిమానిని. అల వైకుంఠపురములో సినిమా అంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి రచనలో ఎంతో లోతు ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో కూడా లోతైన మాటలు రాయడం ఆయనకే చెల్లుతుంది. రాంకీ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. విజయ్ దేవరకొండ నా తమ్ముడు. నా మహానటి, సీతారామం సినిమాలకు విజయ్ వచ్చాడు. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ కి వచ్చాడు. ఇది విజయం సాధిస్తుంది. విజయ్ నా లక్కీ చార్మ్. లక్కీ భాస్కర్ ఒక కామన్ మ్యాన్ స్టోరీ. ఇది మీ అందరికీ నచ్చుతుంది. ” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన త్రివిక్రమ్ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన చినబాబు గారు, వంశీ గారికి కృతఙ్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తారు. ఇంత మంచి టీంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సుమతి అనేది ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో నాకు ఇష్టమైన పాత్ర. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన వెంకీ గారికి ధన్యవాదాలు. దుల్కర్ గారి లాంటి గొప్ప నటుడితో, మంచి మనిషితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మంచి కథలు, పాత్రలతో మిమ్మల్ని ఇలాగే అలరిస్తానని తెలుగు ప్రేక్షకులకు మాట ఇస్తున్నాను. అక్టోబర్ 31న థియేటర్లలో కలుద్దాం. లక్కీ భాస్కర్ మీ అందరికీ నచ్చుతుంది. సుమతి పాత్ర ఇంకా బాగా నచ్చుతుంది.” అన్నారు.

- Advertisement -