లారీ యజమానుల సమ్మె విరమణ..

213
Lorry strike News
- Advertisement -

తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పర్మిట్‌ కోసం చర్యలు తీసుకుంటామని, సింగిల్‌ పర్మిట్‌ కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, చెక్‌పోస్టుల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట దగ్గర పార్కింగ్‌కు 9 ఎకరాల 37 గుంటల స్ధలం కేటాయించడంతో పాటు మూసాపేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో పార్కింగ్ కోసం స్ధల పరిశీలన చేస్తామని తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ట్రాన్స్ పోర్ట్ జాయింట్ కమిషనర్ వ్యవహరించనున్నారు.

లారీ యజమానుల సంఘం కోరిక మేరకు లారీ ఫిట్ నెస్, పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వ అంగీకారం తెలిపింది. కంపోజిట్ ఫీజు బకాయిలు మాఫీ అంశంపై పరిశీలించి 15 రోజుల్లో కమిటీ నివేదించనుంది. చెక్ పోస్టుల ఆధునీకరణకు దశల వారీగా చర్యలు చేపట్టడంతో పాటు కొత్తగా ట్రక్ ఆపరేట్లు హైవే ఏమినీటి సొసైటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. వాహనం సామర్ద్యం పరిశీలన శాస్త్రీయ బద్దంగా జరిపేందుకు ఎంవీఐ,ఏఎంవీఐలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. లారీ ఓనర్ అసోసియేషన్‌ నాయకులతో ప్రతీ రెండు నెలలకోసారి చర్చలు జరపనున్న రవాణ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

- Advertisement -