ఆరునూరైన తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తెలిపారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ టీఆర్ఎస్‌దే అధికారమని స్పష్టం చేశారు.
అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. ప్రజలు మాకు పూర్తి మెజారిటీ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపిన సీఎం….ఈ మధ్య రాజకీయాల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ఆర్ధిక ప్రగతి సాధించిందని తెలిపారు.భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా స్టేట్ ఓన్ రెవెన్యూలో తెలంగాణకు దరిదాపులో లేదన్నారు.
21.96 శాతంతో స్టేట్ ఓన్ రెవెన్యూ సాధించామన్నారు. ప్రతిపక్ష పార్టీలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణకు ఇప్పటివరకు 40 అవార్డులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. అవాకులు,చవాకులు పేలుతు అడ్డగొలు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. విపక్షాలు ఇప్పటివరకు ఏ ఒక్క ఆరోపణను రుజువుచేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సాధించిన ఘనత తమకే దక్కిందన్నారు.రాజకీయాల్లో అసహనం మంచిదికాదని సూచించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది విచ్చలవిడి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరునూరైన తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదన్నారు. అందుకే ముందస్తుకు పోతున్నామని తెలిపారు సీఎం.
పదవుల కోసం ఏనాడూ లాలూచి పడలేదని స్పష్టం చేశారు. 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పారు సీఎం సిట్టింగ్‌లో చెన్నూర్,అందోల్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించమన్నారు.చొప్పదండి,మేడ్చల్,వికారాబాద్,వరంగల్ ఈస్ట్,మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే స్థానాలను పెండింగ్‌లో ఉంచామన్నారు. నవంబర్లో ఎన్నికలు,డిసెంబర్‌లో ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. అనేక సర్వేల తర్వాతనే సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చామన్నారు. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.