తెలంగాణ అసెంబ్లీ రద్దు…ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్

205
kcr

అంతా ఉహించనట్లే జరిగింది. ముందస్తు ఎన్నికలకు జై కొట్టారు సీఎం కేసీఆర్. ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం …అసెంబ్లీ రద్దుపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మానంపై కేసీఆర్ సహా మంత్రులంతా సంతకాలు చేశారు. అనంతరం అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు.

గవర్నర్‌ని కలిసిన అనంతరం గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు కేసీఆర్. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను వివరించనున్నారు. అంతేగాదు ఈ సమావేశంలోనే ఫస్ట్‌ లిస్ట్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను గవర్నర్ నరసింహన్‌ కోరనున్నారు. శాసనసభ రద్దయ్యాక 119 మంది ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోతారు. కేబినెట్ మాత్రం యథావిధిగా బాధ్యతలు చేపడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలి కొనసాగుతుంది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి 4 సంవత్సరాల 3 నెలల నాలుగు రోజులు. 2014 మే 2వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నుంచి నియోజకవర్గ పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 50 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 100 బహిరంగ సభలను నిర్వహించనున్నారు.