గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లక్ష్యంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు తంగెడు పువ్వు ఆకారంలో మైదానంలో నిలబడ్డారు. పసుపుపచ్చ, ఆకుపచ్చ చీరలు ధరించిన మూడు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మూడు వేల బతుకమ్మలను మహిళలు ఒకేసారి పేర్చనున్నారు.
ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కూడా సాయంత్రం మహాబతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. సద్దుల బతుకమ్మను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభయాత్ర సాగనుంది. బతుకమ్మల నిమజ్జనం కోసం ఘాట్ లు ఏర్పాటు చేశారు. ఈ మహా బతుకమ్మలో 3వేల 500 మంది మహిళలు పాల్గొననున్నట్లు అంచనా వేస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. సిటీ పోలీస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఉంది. నిఘా కెమెరాలతో భద్రతను సమీక్షిస్తున్నారు. వేల సంఖ్యలో మహిళలు తరలి వస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, పర్యాటక శాఖల సమన్వయంతో భద్రత, ఏర్పాట్లు జరుగుతున్నాయి.