తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏటూ కాకుండ పోయేలా ఉందా…? బండి సంజయ్ పాదయాత్ర ప్రభావం చూపటం లేదా…? జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చినా హైప్ కనిపించటం లేదన్న బాధలో బండి ఉన్నారా…? ఓవైపు టీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ తో మధ్యలో నలిగిపోతున్నామన్న ఒత్తిడితో ఉన్నారా…? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పాదయాత్ర చేసినా ఫలితం కనపడటం లేదన్న టెన్షన్ లో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తను ఎండను లెక్క చేయకుండా చేస్తున్న పాదయాత్రతో కనీసం మైలేజ్ కూడా రావటం లేదు సరికదా పాదయాత్ర కనీసం జాతీయ నాయకుల ఎంట్రీతో అయినా పరిస్థితిలో మార్పు వస్తుందని సంజయ్ వర్గం భావించింది. జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చారు. సంజయ్ పాదయాత్రకు కాస్త హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా… పరిస్థితులో మార్పు రాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
నిజానికి నడ్డా హైప్ ను కాంగ్రెస్ హైజాక్ చేసిందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో ఉంది. నడ్డా వచ్చి పార్టీలోకి వలసలు ప్రోత్సహించాలని, జనాకర్షక నేతలను పార్టీలోకి తీసుకరండని కోరారు. నిజానికి ఇప్పటికే చేరిన వలసలతోనే పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఈ సమయంలో ఇతర పార్టీల నేతలను తీసుకోవాలని నడ్డా సూచించారు. అంతేకానీ, బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్, నేతలు కలిసికట్టుగా ఏం చేయాలన్న అంశాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇది బండి సంజయ్ అండ్ టీంకు ఇబ్బందిగా మారగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ దూకుడు పెంచితే టీఆర్ఎస్ తో పోటీలో కూడా లేకుండా పోతామన్న భయం ఇప్పుడు బీజేపీ శ్రేణులను వెంటాడుతోంది.
రాహుల్ పర్యటన ఉందని తెలిసే బీజేపీ నడ్డాను ఆహ్వానించింది. నిజానికి నడ్డాకు బదులుగా అమిత్ షా వచ్చి జనగాంలో సభ పెడతారని కొన్ని రోజుల కింద ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. అయితే నడ్డా వచ్చారు. కానీ ఉపయోగం లేకుండా పోయిందని, రాహుల్ ఇచ్చిన ఊపుతో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచితే టీఆర్ఎస్ కన్నా బీజేపీకే ఎక్కువ నష్టం జరగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అన్నట్లుగా ఉన్న పరిస్థితి నుండి టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చేది కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయని బీజేపీ భయపడుతున్నట్లుగా భావిస్తూ ఉన్నారు.