ఇంతింతై వటుడింతై అన్న సామెతను హాస్యనటుల్లో అల్లు రామలింగయ్యకు అనువుగా ఉపయోగించవచ్చు..తెలుగువారి నవ్వుల వనంలో ఎన్నెన్నో వాడని పువ్వులు… వాటిలో అల్లు వారి నవ్వుల పువ్వు నిత్యం గుబాళిస్తూనే ఉంది. ఆరంభంలో బిట్ రోల్స్ లో అలరించిన అల్లు, ఆ తరువాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించారు… కామెడీనే కాకుండా సెంటిమెంట్, విలనీ కూడా అల్లువారు పండించిన తీరు జనాన్ని విశేషంగా అలరించింది… అల్లు రామలింగయ్య ఏది చేసినా, అది నవ్వులు పూయించడం రివాజయింది. నేడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన పంచిన హాస్యసుగంధాన్ని గుర్తు చేసుకుందాం…
1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేశాడు.అలా మొదలైనంది ఆల్లు నట జీవితం.
చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ‘ వద్దంటే డబ్బు ‘ లో అవకాశం వచ్చింది. హాస్య నటుడిగా ఎదిగారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు.
సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. నిజజీవితంలో హోమియోపతి వైద్యం చేస్తూనే మరోవైపు సినిమాల్లో దొరికిన పాత్రలో పరకాయప్రవేశం చేసి పకపకలు పంచారు.
రేలంగి తరువాత పద్మపురస్కారాన్ని అందుకున్న హాస్యనటునిగా అల్లు చరిత్రలో నిలిచారు… రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయన ప్రతిభను వెదుక్కుంటూ వెళ్ళింది… అల్లు భౌతికంగా లేకపోయినా, ఆయన పంచిన హాస్యం మన తెలుగువారికి మిగిలిన ఓ ఆస్తి.