‘రైతుబీమా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఆగస్టు 14 రాత్రి నుంచే రైతు బీమా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో రైతు బీమా పథకంపై రివ్యూ నిర్వహించిన సీఎం..ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకంగా రైతు బీమా నిలుస్తందన్నారు. రైతు భీమా పథకం… తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసా అని అన్నారు.
ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే పదిరోజుల్లో ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని సూచించారు. చెక్కును కుటుంబ సభ్యులకు చేరే విధంగా, యంత్రాంగాన్ని నియమించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . దాదాపు రూ. 636 కోట్లతో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకాన్ని మనం ప్రారంభిస్తున్నామని చెప్పారు.
రైతుకు బీమా అందే క్రమంలో దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. రైతు మరణించిన వెంటనే సదరు సమాచారాన్ని ఎవరు నమోదు చేసుకోవాల్సి వుంటుంది? ఆ సమాచారాన్ని ముందుగా ఎవరికి చేరవేయాలి? జీవిత బీమా సంస్థ అధికారులకు ఎట్లా తెలియజేయాలి? బీమా సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని నియమ నిబంధనల్లో వ్యవసాయ విస్తరణ అధికారి పాత్ర, గ్రామ కార్యదర్శి పాత్ర, రైతు సమన్వయ సభ్యుల పాత్ర ఏ విధంగా వుండాలి తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు.
రైతుబీమా పథకంలో ఇప్పటికీ ఇంకా పేరు నమోదుకాని అర్హులైన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని, వారికి సంబంధిత ప్రీమియం డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం స్పష్టంచేశారు.