దాణా కుంభకోణంలోని ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోషాక్ తగిలింది. మూడో కేసులోనూ లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను దోషిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పువెలువరించింది.దీంతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ కేసులో జగన్నాథ్ మిశ్రా దోషిగా తేలడం మాత్రం ఇదే తొలిసారి. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్నారు.
1991 నుంచి 1994 మధ్య జరిగిన ఈ కుంభకోణం 1997లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశువుల దాణా పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొందరిపై కేసు నమోదైంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తన భార్య రబ్రీ దేవిని సీఎంను చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
ఇందులో ఒకటైన చైబాసా కోశాగార కేసులో ఇప్పటికే లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు జైల్లో ఉన్న లాలూ.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
రెండో కేసులో దేవ్‌ఘర్ ఖజానా నుంచి రాత్రికిరాత్రే రూ.90 లక్షలు అక్రమంగా విత్‌డ్రా చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.1991 నుంచి 1994 మధ్య ఈ ఖజానా నుంచి రూ.89లక్షలు పశుదాణా పేరుతో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో 38 మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. విచారణ సమయంలో వీరిలో 11 మంది మృతిచెందగా, మరో ముగ్గురు అప్రూవర్‌గా మారారు. ఇంకో ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో 2006లో వారికి శిక్ష విధించారు. తాజాగా మిగిలిన 22 మందిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూ సహా 15 మందిని దోషులుగా తేల్చింది. తాజాగా మూడోకేసులో లాలూకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది.