జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రం ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఆదర్శ గృహిణి అన్నది ఉపశీర్షిక. సిరిపురపు విజయభాస్కర్ సమర్పణలో జి.విజయకుమార్ గౌడ్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం నటి వాణీ విశ్వనాధ్‌ని దర్శకుడు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాణీ విశ్వనాధ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్ని తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి.
‘కాటమరాయుడు’, ‘ఖైదీ నంబరు 150’ సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు లేటెస్ట్ టాక్. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. అదే కనుక నిజమైతే ఈ సినిమా మరింత సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుడు కేతిరెడ్డి నుంచి ఎటువంటి సమాచారం లేదు. కాగా రాయ్‌లక్ష్మి నటించిన ‘జూలీ 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.