జంపింగ్ జపాంగ్‌లతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు టీడీపీ నుండి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుండగా ఆపరేషన్ ఆకర్ష్‌తో వైసీపీ నుండి నేతలను సైకిల్ ఎక్కించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో టీడీపీ,వైసీపీల్లో సీట్లు ఆశీంచే వారి సంఖ్య పెరిగిపోతోంది.
టీడీపీ నుండి వైసీపీకి,వైసీపీ నుండి టీడీపీకి గొడదూకుతున్న నేతలకు తోడు కొత్తగా సీటు ఆశీస్తున్న వారితో ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెరిగిపోతోంది. ఇక ఏపీ విభజన జరిగితే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తన మనసుమార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ల్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.
గతంలో విజయవాడ నుండి రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచిన లగడపాటి ఈసారి సైకిల్ ఎక్కి సవారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏలూరు ఎంపీ టికెట్ ఆశీస్తున్న లగడపాటి నెలాఖరున పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఏలూరు నుండి ప్రస్తుతం ఎంపీ మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయంగా సీనియర్ నేతగా ఉన్న మాగంటి మరోసారి ఇక్కడి నుండే పోటీకి తహతహలాడుతుండగా ఆయనకు గట్టిపోటీ ఎదురవుతోంది. మాజీ ఎంపీ బోళ్ళ బుల్లిరామయ్య మనువడు రాజీవ్ పేరుతో పాటు లగడపాటి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే లగడపాటికి ఈసారి ఏలూరు టికెట్ ఖాయమని ఆయన సైతం ఇక్కడి నుండే పోటీచేయడానికి సుముఖంగా ఉన్నారనే చర్చ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.