ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్, మహిళా కండెక్టర్ కొట్టుకున్నారు. టికెట్ తీసుకునే విషయంలో ఏర్పడిన వివాదం చివరకు ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.
నవాబ్‌పేట నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఈఘటన జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ను కార్డు చూపించాల్సిందిగా కండెక్టర్ శోభారాణి కోరారు. అయితే ఒరిజినల్ లేదంటూ జిరాక్స్ ను చూపించింది కానిస్టేబుల్.

జిరాక్స్ ను కాదు ఒరిజినల్ చూపించాలని కండెక్టర్ కోరింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొట్టుకోవడం వరకూ వెళ్ళింది. కండెక్టర్‌ను కానిస్టేబుల్ ఎదురుగా ఉన్న సీట్లో పడేసి తీవ్రంగా కొట్టింది. ఇప్పటి వరకు తనను ఎవరూ టికెట్ అడగలేదు.. నీవు అడుగుతావా.. పళ్లు రాలగొడుతా అంటూ తనపై కానిస్టేబుల్ దాడి చేసిందని కండెక్టర్ శోభారాణి చెబుతున్నారు. తాను కేవలం ఒరిజినల్ చూపించాల్సిందిగా కోరినందుకు కొట్టడంతో పాటు.. తిరిగి తానే ఆమెను కొట్టినట్టుగా సొంత పీఎస్‌లో కేసు పెట్టిందని కండెక్టర్ వాపోయారు.
అయితే కానిస్టేబుల్ కండెక్టర్‌ను పడేసి కొడుతున్న దృశ్యాలకు కొందరు ప్రయాణికులు సెల్ఫోన్లలో రికార్డు చేసి మీడియాకు అందించారు. ఈ ఘటనలో నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇరువురి మధ్య రాజీ కుదుర్చారు. అయితే నిబంధనల ప్రకారం పోలీస్ సిబ్బంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సమయంలో డ్రెస్‌లో ఉన్న, ఐడీ ఉన్న టికెట్ తీసుకోవాలని కేవలం దూరం ప్రయాణాలకు వెళ్లే సమయంలో వారెంట్ ఉంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఘటనపై ఎస్పీ అనురాధ విచారణకు ఆదేశించారు.

