ఎల్లో జర్నలిజంపై కేటీఆర్‌ ఫైర్‌

193
KTRs concern on Yellow Journalism ...
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నాలుగో స్తంభమే(మీడియా) అవినీతిలో కూరుకుపోతే అది దేశ ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరం అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి మకిలి అంటించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కామ్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు ప్రభావితం అనే కథనంపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలను  ప్రచురించిందని దుయ్యబట్టారు.

ఎకనామిక్స్ కథనంపై ఫేస్ బుక్‌లో స్పందించిన కేటీఆర్ మన దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతి, అక్రమాలకు పాల్పడితే పత్రికలు, మీడియా ముందువరుసలో నిలిచి, వాటిని బయటపెట్టాయి. రాజకీయ నాయకుల చీకటి లావాదేవీల గుట్టు ప్రజల ముందు బయటపెట్టేదీ మీడియానే. కొన్ని కేసులలో ఎన్నికైన అభ్యర్థుల తలరాతలనే మార్చివేసింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు పాటుపడుతూ, సరికొత్త ఉత్సాహాన్ని నింపడంలో మీడియాది కీలక పాత్ర. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థకు లేని వెసులుబాటు మీడియాకు ఉంది. మీడియా సంస్థలు కూడా స్వాతంత్య్రం నాటి నుంచి ఈ స్వేచ్ఛను ఎంతో పరిణతితో, బాధ్యతాయుతంగా వినియోగిస్తున్నాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ స్వేచ్ఛను సంచలనాలకోసం వాడుకుంటూ సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.

నిందలేసేవారిని ఎదుర్కొనడం తెలంగాణకు కొత్తేమీ కాదని…. రాష్ట్ర సాధన ఉద్యమం రోజుల్లో ఇలాంటివాళ్లు ఎంతోమంది ఉండేవారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు తెలంగాణ అంధకారం అవుతుందని జోస్యాలు చెప్పారు. కానీ.. ఈ రోజు మండు వేసవిలోనూ పరిశ్రమలకు విద్యుత్‌ను సరఫరా చేస్తు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలన్నీ తరలిపోతాయని, అభివృద్ధి కుంటుపడుతుందని దుష్ప్రచారం చేశారు. కానీ.. నేడు దానికి పూర్తి భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో సాక్షాత్కరించింది. తెలంగాణ రాష్ట్రం అనూహ్యంగా వృద్ధి చెందుతున్నది. ఐటీ ఎగుమతుల్లో దేశీయ సగటుకంటే రాష్ట్ర సగటు అధికంగా నమోదైంది. తలసరి ఆదాయం విషయానికి వస్తే.. దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కిందన్నారు.

ప్రపంచంలోనే పేరెన్నిక గల ఐదు దిగ్గజ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లోనే కార్యాలయాలు ఏర్పాటుచేశాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, అమెజాన్, ఉబర్, సేల్స్‌ఫోర్స్, బోయింగ్, డీబీఎస్, జెడ్‌ఎఫ్ వంటివి నగరానికి వచ్చాయి. గత రెండేండ్లలో చారిత్రాత్మక, విప్లవాత్మకమైన విధానం టీఎస్-ఐపాస్ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా, నేటివరకు సుమారు 3,828 సంస్థలకు అనుమతినివ్వగా.. అందులో దాదాపు యాభై శాతం కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో ఐటీరంగంలో 1,04,495 మందికి, పారిశ్రామికరంగంలో 2,28,355 మందికి ఉద్యోగాలను కల్పించింది. రాష్ట్ర జీడీపీ 10.1 శాతానికి పెరిగింది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే అధిక జీడీపీలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్త.. రాష్ట్ర ప్రభుత్వ డైనమిజాన్ని ప్రశంసలతో ముంచెత్తారని గుర్తుచేశారు.

కొత్త పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఉద్యోగితను పెంపొందించడానికి కొత్త రాష్ట్రం అహర్నిశలు శ్రమిస్తుంటే.. కొన్ని వార్తాసంస్థలు డబ్బులు తీసుకుని కథనాలు రాయడం ద్వారా రాష్ట్రానికి మకిలి అంటించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో, ఇటీవల ఎకనామిక్ టైమ్స్ తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కామ్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు ప్రభావితం అనే కథనాన్ని ప్రచురించడం ద్వారా సంచలనాత్మక జర్నలిజంలో మరింత నీచానికి దిగజారిపోయింది. ఈ కథనంలో పేర్కొన్న ఉదంతాలన్నీ తెలంగాణ ఆవిర్భావానికంటే ముందటివి. కొన్ని పదేండ్ల క్రితం చోటుచేసుకున్నవీ ఉన్నాయి. కొత్త రాష్ర్టానికి ఇలాంటి సమస్యలు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించాయనేది అందరికీ తెలిసిందే.

తెలంగాణ ఆవిర్భవించిన నాలుగు వారాల్లోపే ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) పత్రిక సుమారు ఏడు వందల సంస్థలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళుతున్నాయనే నిరాధార కథనాన్ని ప్రచురించింది. నిజానికి అది పూర్తి అవాస్తవం.

సరిగ్గా నెల తిరుగకముందే.. తెలంగాణలో పరిస్థితులు సానుకూలంగా లేవంటూ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపేలా మరో నిరాధార కథనాన్ని ప్రచురించింది. ఇలా రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే అనేక కథనాలను ఎకనామిక్ టైమ్స్ ప్రచురిస్తూనే ఉంది. గత మూడేండ్లుగా హైదరాబాద్‌లోని ఎకనామిక్ టైమ్స్ బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా వరుస కథనాలు రాస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి ఎకనామిక్ టైమ్స్ బ్యూరో చీఫ్ హాజరుకారు. ఇన్వెస్టర్ల ముందు తెలంగాణను అపహాస్యం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ధోరణి కనిపిస్తోందన్నారు కేటీఆర్.

- Advertisement -