తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. టెక్స్‌టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు శనివారం లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగంపై మోదీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తతను ఉన్నదని తన లేఖలో కేటీఆర్ విమర్శించారు. శుష్క వాగ్ధానాలు , రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోందని మండిపడ్డారు. తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని తెలంగాణ నేతన్నలకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. నిజానికి తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని ఆ లేఖలో కేటీఆర్ ఆరోపించారు.
నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము, అధికారంలోకి వచ్చిన ఈ 8 సంవత్సరాల నుంచి టెక్స్‌టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీక అయిన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ ప్రభుత్వం టెక్స్‌టైల్ – చేనేత రంగంపై కూడా కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఆ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచింకుండా చేనేతపైన జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటు నేతన్నల పొట్టగొడుతున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళీ, టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి మంత్రి కేటీఆర్ పలు తన లేఖ ద్వారా తీసుకువచ్చారు.
దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం సహాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్ పార్క్ ఎక్కడ ఉందో? తెలంగాణ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. సూమారు రూ.1,552కోట్ల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే, ఇప్పటివరకు స్పందించని బీజేపీ ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంతో పోటి పడేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైబర్ టూ ఫ్యాషన్ మోడల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో ప్రపంచ టెక్స్‌టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యత కలిగిన మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం సహకారం అందించాలని కోరారు.
రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తే ఇంతవరకు అతీగతీ లేదన్నారు. రాష్ట్రంలోని పవర్ లూమ్ మగ్గాల అప్‌గ్రేడేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 50శాతం నిధులను భరించేందుకు సిద్ధంగా ఉన్నా, ఇందుకు సంబంధించిన కేంద్రం నిధుల కోసం కేంద్రాన్ని కోరితే స్పందన లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణలోని మరమగ్గాల అప్ గ్రేడేషన్ కొసం వేంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 26,000 మంది పవర్ లూం కార్మికుల ఆర్థిక భవిష్యత్ కోసం మోదీ సర్కార్ చేసింది ఏం లేదన్నారు. కాని నేతన్నలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నేతన్నల కోసం వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్ తో పాటు కామన్ ఫెసిలిటీ సెంటర్లను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. యాదాద్రి, గద్వాల, నారాయణ్‌పేట, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్ వంటి జిల్లాల్లో అత్యంత నైపుణ్యం కల సుమారు 40వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇక్కత్, గొల్లభామ వంటి చీరలకు తెలంగాణ నెలవుగా ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లినందున అదే ఇన్‌స్టిట్యూట్‌ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం స్పందిచలేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు కేటీఆర్. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (NHDP)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని మోడీ సర్కార్ బుట్ట దాఖలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపై కూడా పన్ను విధించిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్టీ పన్ను పోటుతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్ర అరాచక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకోనైనా టెక్స్ టైల్ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని, ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఈ జీఎస్టీ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

