కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని తాము స్టార్టప్ స్టేట్‌గా పిలుస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతన వ్యాపార దృక్పథం, పాలసీలతో ముందుకు పోతున్నామని, తాము రూపొందించిన పాలసీలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల చెన్నై పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఇండియాటుడే గ్రూప్ నిర్వహించిన ది సౌత్ ఇండియా కాంక్లేవ్‌లో మంగళవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..దేశాల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణకు వివిధ రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. పరిజ్ఞానం, పాలసీలను మార్పిడి చేసుకోవటం ద్వారా దేశానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ అనేది ఇపుడు రాష్ర్టాల మధ్య కాకుండా దేశాల మధ్య పోటీగా మారిందన్నారు కేటీఆర్.
హైదరాబాద్ నగరం ఐటీతోపాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉందన్నారు. టీఎస్‌ఐపాస్ ప్రత్యేకతలను మంత్రి వివరించారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా పరిశ్రమలు నెలకొల్పడం అనేది తెలంగాణలో వాస్తవ రూపం దాల్చిందని పేర్కొంటూ ఈ విధానం దేశవిదేశాల్లో ప్రశంసలు పొందిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకులో నిలవడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వివరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అంతకముందు పలువురు పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం టీవీఎస్ లాజిస్టిక్స్ ఎండీ ఆర్ దినేశ్ బృందంతో సమావేశమై రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలు విస్తరించాలని ఆహ్వానించారు. సరుకు రవాణా రంగంలో పేరెన్నికగన్న అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు కూడాతెలంగాణలో అతిపెద్ద వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేశాయని తెలిపారు. భౌగోళికంగా దేశానికి మధ్యన ఉండటంతోపాటు అత్యుత్తమ మానవ వనరుల లభ్యత తెలంగాణ రాష్ర్టానికున్న బలమని కేటీఆర్ వివరించారు. మంత్రి ప్రతిపాదనకు స్పందించిన టీవీఎస్ ఎండీ జీఎస్టీ బిల్లు అమలులోకి రాగానే తమ సంస్థ విస్తరణ ప్రణాళికలపై చర్చించేందుకు రాష్ర్టానికి వస్తామని చెప్పారు.