ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మిట్టా యాదవరెడ్డి 88వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని హబ్సిగూడలోని తన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డిలు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నడవలేని దశలో ఎక్కువగా మంచంపైనే ఉంటున్న మిట్ట యాదవ రెడ్డి గారిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక జ్ఞాపికను కూడా అందించారు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో మిట్టయాదవ రెడ్డి కేక్ కట్ చేయగా, వారికి మంత్రి కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో అయన చేసిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పోరాటాల్లో తాను నిర్వహించిన పాత్రను అయన మంత్రి వివరించారు. తదనంతరం యాదవ రెడ్డి గారు స్వయంగా రచించిన “నా జ్ఞాపకాలు” అనే ఆత్మకథను మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గార్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి యాదవ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. అటు అనుక్షణం తాను తెలంగాణ కొరకే పరితపించానని, ఇవ్వాళ కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధిపథంలో నడవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మిట్ట యాదవరెడ్డి. మంత్రి కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని యాదవరెడ్డి గారు కితాబిచ్చారు. తెలంగాణ రాష్ర్టం సరైన దిశలో వెళ్తుందని, తెలంగాణ నాయకత్వంపైన అభినందనలు తెలిపారు.