వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం- కేటీఆర్‌

531
- Advertisement -

కరోనా నియంత్రణకు రాబోయే రెండు వారాలు చాలా కీలకమని మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ నియమాలను ప్రజలందరూ తప్పక పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.

కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గం అని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. స్వీయ నియంత్రణతో వ్యాధి సోకకుండా చూసుకోవడమే అసలైన మందు అని,ఆ దిశగా ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలతో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కరోనాను కట్టడి చేసే విషయంలో రాజన్న సిరిసిల్ల మెరుగైన స్థితిలో ఉందన్నారు. అధికారుల కృషితో పాటు జిల్లా ప్రజల సంపూర్ణ సహకారం వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

లాక్ డౌన్ ముగిసే వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు అని మంత్రి కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే మాస్కులు ధరించి రావాలన్నారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన విధంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకారం అందించాలి అని పేర్కొన్నారు. ప్రజలు ఇదే విధమైన సహకారం అందిస్తే జిల్లాలో కరోనా కేసు ఒకటి కే పరిమితం అవుతుంది అన్నారు.

కరోనా నియంత్రణ చర్యలను పట్టణాల్లోకంటే గ్రామాల్లోనే ప్రజలు నిక్కచ్చిగా పాటిస్తున్నారని మంత్రి తెలిపారు. పల్లె ప్రజలను ఆదర్శంగా తీసుకొని పట్టణ ప్రజలు కూడా కరోనా నియంత్రణకు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ అమలు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకొని జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సహకారం అందించాలని కోరారు.

కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. ప్రజల అందరి సహకారంతో రాష్ట్రం కరోనా ఫ్రీ గా త్వరలో అవిర్భవిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న దృష్ట్యా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో జిల్లాలో ఉన్న వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చూసుకుంటుందన్నారు.

మరోవైపు ఏప్రిల్ మాసం పంట కోతకు వచ్చే సమయమని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి తెలిపారు ..గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఒక లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ప్రస్తుత రబీ సీజన్లో మూడు లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవ్వనుందని అధికార గణాంకాలు చెబుతున్నా యన్నారు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్లలో సాగు నీటి సౌకర్యం మెరుగ వ్వడంతో దాదాపు రెట్టింపు ధాన్యం ఉత్పత్తి సాధ్య పడిందన్నారు.

రెట్టింపు ధాన్యం ఉత్పత్తి జరిగినప్పటికీ ఈ మొత్తం ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ,జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందన్నారు.ఇందుకుగాను జిల్లాలో 212 ధాన్యం కొనుగోలు సెంటర్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయనుందని మంత్రి తెలిపారు. కాగా ఇప్పటివరకు 139 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. మక్కల కొనుగోలుకు ఇప్పటివరకు మూడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో వరి కోత వేగంగా చేపట్టేందుకు 116 హార్వెస్ట ర్ లు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయన్నారు.

కరోనా నియంత్రణ చర్యలతో పాటు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని మంత్రి తెలిపారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్మన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రి కే తారకరామారావు కు 18 లక్షల రూపాయల విరాళం అందించారు. సదరు చెక్కును కలెక్టర్ కు అందించిన మంత్రి కార్మికుల సంక్షేమం కోసం ఆ మొత్తాన్ని వెచ్చించాల్సిందిగా కోరారు.

- Advertisement -