జలదృశ్యంలో ఒక్కడిగా పార్టీని ప్రారంభించిన కేసీఆర్…ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసించి స్వరాష్ట్ర నెరవేర్చారని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఈ 18 సంవత్సరాల ప్రయాణంలో ఆయన వెంట నడస్తున్న గులాబీ సైనికులందరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది రాజకీయ పార్టీని స్ధాపిస్తే నిలదొక్కుకున్నయి రెండే పార్టీలని తెలిపారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్‌కి ఎన్నో సానుకూలతలు కానీ కేసీఆర్ పార్టీని స్ధాపించేనాటికి ఉన్న పరిస్థితి వేరన్నారు.47 ఏళ్ల వయసులో పార్టీని స్ధాపించి ప్రజల గొంతుక వినిపించారని చెప్పారు.
రాజకీయ నాయకులు తెలంగాణ నినాదాన్ని స్వార్ధ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారనే అపోహ ప్రజల్లో ఉందన్నారు కేటీఆర్. అలాంటి పరిస్ధితుల్లో పార్టీ స్ధాపించి ముందుకు నడపడం సాహసోపేత నిర్ణయం అన్నారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఇచ్చిన స్పీచ్ ఇప్పటికి అందరికి గుర్తుందన్నారు. త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆనాడు డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యే,టీడీపీ పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు.
పొరపాటున ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టిచంపండి అని కేసీఆర్ నినదించారని గుర్తుచేశారు కేటీఆర్. 2001 నుండి 2004 వరకు జిల్లా పరిషత్,సర్పంచ్ ఎన్నికలను మొక్కవొని ధైర్యంతో ఎదుర్కొన్నారని చెప్పారు. చాలా తక్కువ మందికి జీవితంలో ఇంత అదృష్టం ఉంటుంది..రాష్ట్ర ఏర్పాటుకోసం పార్టీని స్ధాపించి ఆ లక్ష్యాన్ని చేరుకున్న కొద్దిమందిలో మీరు ఒకరని కేసీఆర్‌ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆశీర్వదించారని చెప్పారు.
18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు,అపజయాలు,ఎత్తు,పళ్లాలను చవిచూశామన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. 2001లో కేసీఆర్ వెంట వేల సంఖ్యలో నడిస్తే నేడు 70 లక్షలకు చేరిందన్నారు. 2001లో ఉద్యమపార్టీగా 2014లో పూర్తిస్ధాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు.
ప్రజల దీవెన టీఆర్ఎస్‌కు ఉందన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు 50 శాతం ఓట్లు వేశారని తెలిపారు. మే 23న వచ్చే ఫలితాల్లో టీఆర్ఎస్ 16కు 16 ఎంపీ స్ధానాలకు గెలవడం ఖాయమన్నారు. గల్లి నుండి ఢిల్లీ దాక గుండె గుండెల్లో గులాబీ జెండా ఎగురుతోందన్నారు. ఇలాంటి నాయకుడు మాకేందుకు లేరని మిగితా రాష్ట్రాల ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు కేటీఆర్. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేద్దామన్నారు. పార్టీలో పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొందన్నారు. పంచాయతీ ఎన్నికలు,జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అనుమతితో ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాలు చేపట్టబోతున్నామని చెప్పారు.బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.