గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్‌

170
ktr speech

టీఆర్‌ ఎస్‌ లోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. నేడు తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తుంగతుర్తికి చెందిన పలుపార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రులు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్‌.. గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారని, వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగరాలన్నారు. అంతేకాకుండా ఎన్నికలంటేనే ప్రతిపక్షనేతలు భయపడుతున్నారని అన్నారు.

అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర గల నేతలున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ను గజ్వేల్‌ లోనే ఓడిస్తామని, కొందరు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కానీ…సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేశారని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీయే చెప్పారని గుర్తుచేశారు కేటీఆర్‌.

అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే..కేసీఆర్‌ మాత్రం అభివృద్దిపై దృష్టి సారించారని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..ప్రజలు టీఆర్ ఎస్‌ కే పట్టంగట్టారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే.. చెవి కోసుకుంటానని సీపీఐ నారాయణ అన్నారని వెల్లడించారు.

దేశంలో నెంబర్‌వన్‌ సీఎం గా కేసీఆర్‌ కు పేరు రావడాన్ని కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..మొత్తం 12 సీట్లను టీఆర్ఎస్‌ గెలవడం ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.