బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలి- కేటీఆర్

261
ktr road show
- Advertisement -

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబీహా బేగంకి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొంతమంది కావాలని పంచాయతీ పెట్టి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ధర్నా అని చెప్పి చార్మినార్‌ దగ్గరికి పోయి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు.

ఏమీ ఇక్కడ చిత్తారమ్మ గుడి లేదా? బల్కంపేటలో ఎల్లమ్మగుడి లేదా?, తాడ్‌బండ్‌లో ఆంజనేయస్వామి గుడి లేదా?, ఆదర్శ్‌నగర్‌లో బిర్లామందిర్‌ లేదా? ఇవన్నీ వద్దు.. పాతబస్తీకి పోవాలే.. అక్కడనే కొట్లాటా పెట్టాలే.. హిందూ-ముస్లిం, ఇండియా-పాకిస్తాన్‌ అని లొల్లిపెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలే ఇదీ వారీ వ్యవహారం అని అన్నారు. అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెళ్లెళ్లు అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌లో మంచి జరిగిందా? చెడు జరిగిందా? అక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నానన్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఒక చక్కని పొదరిల్లులాగా ఉన్న హైదరాబాద్‌లో ఎలాగైనా చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి కొత్త బిచ్చగాళ్లు మొదలయ్యారని దుయ్యబట్టారు.అట్లాంటివారు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకుందామా అని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చి ఆరేండ్లు అయితుంది. ఈ ఆరేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందంటే మనం వంద చెప్పగలుగుతాం.. మరి ఆరేండ్లలో ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్దిని చూసి ఓటు వేయండి అని మంత్రి కేటీఆర్‌ కోరారు.

- Advertisement -