చార్జిషీట్లు వేయాల్సింది బీజేపీ సర్కార్ మీద- కేటీఆర్

154
ktr speech
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా రోడ్ షోకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీరు పట్ల విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు ఛార్జ్ షీట్లు వేస్తారో చెప్పాలన్నారు. హైదరాబాద్ నగరంలో కరెంటు కష్టాలు తీర్చినందుకా ? అన్నపూర్ణతో 5 రూపాయలకే ప్రజల కడుపులు నింపుతున్నందుకా ? బస్తీ దవఖానాలతో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నందుకా ? గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టినందుకా ? ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చినందుకా ? పెట్టుబడులు వస్తున్నందుకా ? శాంతి భద్రతలను కాపాడుతున్నందుకా ? పేదింటి పెండ్లికి కళ్యాణ లక్ష్మి తో అండగా నిలబడుతున్నందుకా సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఒకవేళ నిజంగా ఛార్జ్ షీట్ చేయాల్సి వస్తే మోడీ ప్రభుత్వం మీద 132 కోట్ల ఛార్జ్ షీట్లు చేయాలన్నారు. తాము గెలిస్తే దేశ ప్రజల అకౌంట్లో ఒక్కొక్కరికీ 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దేశ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తప్పించుకున్న బీజేపీ ప్రభుత్వం మీద ఈ ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు దేశ యువత, నిరుద్యోగులు ఛార్జ్ షీట్లు వేయాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వంలో కల్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసుకుంటున్నాం. ఇలాంటి పథకాలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని కేటీఆర్ అన్నారు. అంతేకాదు ఓట్ల కోసం భాద్యత రాహిత్యంగా యువతను పెడదోవ పట్టించే విధంగా బీజేపీ నాయకుల తీరు పట్ల కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు. ముగ్గురు ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనాల ప్రయాణించినా పరవాలేదు, తాగి బండి నడిపినా పరవాలేదు, మమ్మల్ని గెలిపిస్తే చలాన్లు అన్నీ మేమె కడతాం అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను గమనించాలన్నారు. నగరంలో ఎక్కడా గుళ్ళు లేనట్లు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లాలని చూడటం హిందూ -ముస్లింల మధ్య వైశ్యమ్యాలు రెచ్చగొట్టడమే అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఈ ఆరేళ్లలో అనేక రంగాల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో ప్రజలను కాపాడుకుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. నిన్న మొన్నటి వరదల్లో ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మోకాల్లోతు నీళ్లలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. వరదల్లో ఇబ్బందుకు ఎదుర్కొన్న నగర ప్రజలకు అర్హులైన ప్రతీ కుటుంబానికి 10 వేల చొప్పున వరద సాయం చేసుకుంటూ వెళ్తుంటే ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసి ప్రజల నోటికాడి ముద్ద లాగేసింది ఎవరో ప్రజలకు తెలుసనన్నారు. 25వేలు ఇస్తామంటున్న బిజెపికి వరద భాధితులు జాబితా అందిస్తామని, కేంద్రం నుంచి వేంటనే ఈ మేరకు అర్ధిక సహాయం అందించి మాట్లాడాలన్నారు.

నగరంలో గత ఆరేళ్లుగా గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బు లేదు, శాంతి భద్రతలకు ఢోఖా లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీనితో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఎవరి పాలనలో హైదరాబాద్ పచ్చగా ఉంటుందో, ఎవరికీ ఓటేస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

- Advertisement -