చిన్నారి దివ్యకి అన్నలా మారిన మంత్రి కేటీఆర్..

189
Minister KTR

పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఒక చిన్నారికి అన్నగా మారి రాఖీ పండుగకు బహుమతి ఇచ్చారు. గత ఏప్రిల్ నెలలో కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన 9 సంవత్సరాల దివ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కిరాయితో ఆటోని నడుపుకునే తండ్రి, దివ్య చికిత్సకు అవసరమైన డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని కూకట్‌పల్లి టీఆర్ఎస్ యువజన నాయకుడు జగన్మోహన్ రావు మంత్రి కెటి రామారావుకి ట్విట్టర్ ద్వారా తెలిపారు. అప్పుడు వెంటనే స్పందించిన మంత్రి నిమ్స్ వైద్యాధికారులతో మాట్లాడి దివ్యకి అవసరమైన పూర్తి చికిత్స అందించాల్సిందిగా కోరారు.

Minister KTR

అప్పుడు మంత్రి సహాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే తన ఎడమకాలిని ప్రమాదంలో పోగొట్టుకుంది. ఆపద సమయంలో అన్నలా ఆదుకున్న మంత్రి కేటీ రామారావుకి రాఖీ కట్టాలన్న తన ఆకాంక్షని దివ్య వెలిబుచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన స్వగృహానికి ఆహ్వానించి దివ్యతో రాఖీ కట్టించుకున్నారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడిన మంత్రి, తనతో రాఖీ కట్టించుకోవడం పట్ల దివ్య సంతోషం వ్యక్తం చేసింది. దివ్యకి ఏం కావాలని మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

Minister KTR

ఆమెకి అవసరమైన కృత్రిమ అవయవాన్ని అందించడంతోపాటు ఇంకేదైనా ఇవ్వాలన్న తన ఆకాంక్షను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తనతో రాఖీ కట్టించుకోవడమే పెద్ద బహుమతి అన్న దివ్య ఇంకేం వద్దంటూ మంత్రికి తెలిపింది. దివ్య తండ్రి కిరాయి తీసుకొని ఆటో నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి త్వరలోనే అయనకు ఒక కొత్త ఆటోను రాఖీపూర్ణిమ బహుమతిగా దివ్య తరపున అందిస్తానని హామీ ఇచ్చారు. కూతురు ప్రాణాలు కాపాడడంతోపాటు కుటుంబ జీవనానికి ఇప్పుడు అటోను అందిస్తానన్న మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని దివ్య కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.