రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తాజ్‌కృష్ణ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సమాచార శాఖ(ఐఆండ్‌పీఆర్) ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 77 మంది మహిళా జర్నలిస్టులను సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మహిళల శ్రమ వెలకట్టలేనిదని… కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినెల 300 పైచిలుకు ప్రసవాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో మాతా శిశుమరణాల శాతం బాగా తగ్గిపోయిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా బాల్యవివాహాలు తగ్గాయి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్ఠికాహారం అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.