తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై కేటీఆర్ చిట్‌చాట్‌లో స్పందిస్తూ పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఆటలలో పాల్గొనడం సరైనదా అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మంత్రి శ్రీదర్ బాబును అడిగినప్పటికీ, సరైన సమాధానం రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయని, వాటిపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే పద్దులపై చర్చను త్వరగా ముగించుకొని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.
ప్రత్యేకంగా ఇరిగేషన్ వంటి కీలక అంశాలు చర్చించాల్సి ఉండగా, ఆ సమయంలో ఎమ్మెల్యేలు ఆటలలో పాల్గొనడం ప్రజలకు ఏ సందేశం ఇస్తుందో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తుంచుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ వంటి అత్యంత ప్రాముఖ్యమైన వేదికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, వినోద కార్యక్రమాలు నిర్వహించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలి. అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యమైన అంశాలపై చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:‘ధురంధర్ 2’పై వివేక్ ప్రశంసలు!

