KTR:రైతులపై లాఠీఛార్జ్..సిగ్గుచేటు?

19
- Advertisement -

ఆదిలాబాద్ లో రైతన్నలపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతన్నలపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అన్నారు కేటీఆర్.

రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించిన కేటీఆర్…ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అన్నారు.రాష్ట్రంలో రైతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతన్నలపైన లాఠీ చార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అన్న కేటీఆర్, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయం ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పా అని కేటీఆర్ ప్రశ్నించారు.

గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇలా తమకు కావాల్సిన అన్నింటిని సాఫీగా అందుకున్నదని, కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారు అయిందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలపై చేసిన లాఠీ చార్జ్ పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సందర్భంలో, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం పేరిట, ఢిల్లీ పర్యటన పేరిట రైతాంగాన్ని పట్టించుకోకపోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత, పంపిణీ, ప్రభుత్వ వైఫల్యంపైన వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతన్నల కష్టాలు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు రైతన్నల పైన లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వం ఇలా లాఠీ చార్జీల పేరుతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని.. రాష్ట్ర రైతన్నలకు అండగా ఉంటామని, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున విస్తృతమైన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read:గం..గం..గణేశా..సక్సెస్ కావాలి:రష్మిక

- Advertisement -