మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్…మేడిగడ్డకు సంబంధించి 1.6 కిలోమీటర్ల బరాజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడడం సరికాదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయి. సాగర్, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను తాము రాజకీయం చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు.
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దీని ద్వారా రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దుష్ర్పచారం చేయడం సరికాదు. తమపై ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోండి. మేడిగడ్డను మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి, దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలన్నారు. మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సాగునీరు లేక ఇప్పటికే కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. వానాకాలం లోగా రిపేర్లు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?