‘గవర్నర్’ పదవీకే సిగ్గు ?

25
- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళ్ సై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించేలా పదేళ్ళ బి‌ఆర్‌ఎస్ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని గవర్నర్ తమిళ్ సై వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గవర్నర్ హోదాలో ఉన్న తమిళ్ సై కాంగ్రెస్ నేతలా మాట్లాడుతున్నారని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కాగా కొత్తగా పాలన ప్రారంభించిన కాంగ్రెస్ కు అభినందనలు చెప్పడం సహజమే. కానీ గత ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం ఏంటని గవర్నర్ తీరుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బి‌ఆర్‌ఎస్ పదేళ్ళ పాలన గురించి మాట్లాడిన గవర్నర్.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కరెంటు కోతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో జరిగిన జీవన విధ్వంసం చాలానే ఉందంటూ వాటి గురించి కూడా గవర్నర్ మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను పోలి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద గవర్నర్ చేసిన ప్రసంగంపై సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. గౌరవ హోదాలో ఉన్న తమిళ్ సై కాంగ్రెస్ కు అనుకూలంగా బి‌ఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం గవర్నర్ గౌరవాన్ని తగ్గించే వ్యాఖ్యలే అని రాజకీయ వాదులు చెబుతున్నారు.

Also Read:బబుల్‌గమ్‌..బ్లాక్ బస్టర్ అవుతుంది

- Advertisement -