తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోనలేకనే కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమిగా జట్టు కట్టారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూటమిలో సీట్లు పంచేది రాహుల్ గాంధీ అయితే.. నోట్లు పంచేది చంద్రబాబు.. కానీ ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలు. అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయ్యాలి.
తెలంగాణను వంచించేందుకు చంద్రబాబు, రాహుల్ గాంధీ దోస్తీ కట్టారు. సోనియాను గాడ్సేతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖంతో కాంగ్రెస్ ముందు మోకరిల్లిండు. దశాబ్దాల నుంచి టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. నాలుగేళ్లలో ఏనాడు ప్రజలకు తెదేపా, కాంగ్రెస్ నేతలు ముఖం చూపించలేదన్నారు. పేద ప్రజల సంక్షేమానికి తెరాస నేతలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
40 ఏళ్ల పాటు కొట్లాడిన కాంగ్రెస్, తెదేపా ఈరోజు ఏకమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీని కలిసిన చంద్రబాబు కేసీఆర్‌ను గద్దె దించాలని కోరుతున్నారని.. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలని తాను అడుగుతున్నానని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు గద్దె దించాలా? 70 ఏళ్లలో మీరు చేయలేని పనులను నాలుగేళ్లలోనే చేసినందుకు గద్దె దించాలా? అంటూ నిలదీశారు. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలి అని అడిగితే వారి వద్ద సమాధానం లేదని విమర్శించారు.
మహబూబాబాద్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయని.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న మీ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ ప్రసంగించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్రం స్పష్టత ఇవ్వకున్నా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.