రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

8
- Advertisement -

అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వడ్డీలపై కాంగ్రెస్ ‘కాకి లెక్కల’ డొల్లతనం బట్టబయలు చేసింది అక్టోబర్ నెల కాగ్ నివేదిక అన్నారు. నెలకు రూ. 2300 కోట్లు కూడా లేని వడ్డీని, రూ. 7 వేల కోట్లని అబద్ధాలు చెప్తున్నారు…కాంగ్రెస్ తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?…సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు బదులుగా స్కాంల కోసమే అప్పులు.. వడ్డీల లెక్కలపై పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అన్నారు.

గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటి తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్ల అప్పులు ఏ ఏ పథకాలకు, ఏ ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలి… అదే విధంగా, గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను కూడా తక్షణమే ప్రజల ముందు ఉంచాలి. వీటితోపాటు ఈ అంశంలో ప్రజలను ముఖ్యంగా శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న ‘కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ (CAG) నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాగ్ అక్టోబర్ నెలలో విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు వాటికి కడుతున్న వడ్డీలను తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నదని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పదేపదే అప్పుల కాకి లెక్కలు అన్ని మరోసారి తేలిపోయాయని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ధ్వజమెత్తారు.

ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ. 7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల పైన మరోసారి చెంప దెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టింది అని విమర్శించారు. కాగ్ లెక్కల ఏప్రిల్ 2025 నుండి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ. 16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పదేపదే 6000 నుంచి 7000 కోట్లు ప్రతినెల వడ్డీలు కడుతున్నామంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న దానిలో సగం కూడా వడ్డీలకు వెళ్లడం లేదు. వడ్డీల పేరుతో అబద్ధాలు చెప్పి, పాలన చేతకానితనాన్ని, తాము చేస్తున్న తప్పులను అవినీతిని అప్పుల మాటున దాచిపెడుతుందని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మధ్య ఉన్న తేడాను వివరంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామిని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలను ముఖ్యంగా శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు.

- Advertisement -