పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్: మంత్రి కేటీఆర్

284
ktr
- Advertisement -

రాష్ట్రంలోని పురపాలికల్లో గ్రీన్ కవర్ ని పెంచడాన్ని మరింత ప్రోత్సహించేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు తెలియజేశారు. పట్టణాల్లో మొక్కల పెంపకాన్ని, పార్కుల అభివృద్ధి మరియు ఇతర హరిత కవర్ పెరిగే కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో “గ్రీన్ స్పెస్ ఇండెక్స్” పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. దీనికి సంబంధించి పట్టణాల్లో పాటించాల్సిన లేదా పరిగణలోకి తీసుకునే అంశాలకు సంబంధించిన వివరాలను ఈరోజు అందజేశారు. గ్రీన్ స్పెస్ ఇండెక్స్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు అర్బన్ ఎఫైర్స్ శాఖ పట్టణాల్లో గ్రీన్ కవర్, ఒపెన్ స్పెస్ ల పైన రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమం ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, అందుకు అత్యవసరమైన గ్రీనరీ పెంచడంలో వినూత్నమైన కార్యక్రమాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పెద్ద ఎత్తున గ్రీన్ కవర్ ను రాష్ట్రవ్యాప్తంగా పెంచే ఉద్దేశంతో కొనసాగిస్తూ వస్తుందని, పట్టణాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుతం చేపడుతున్న గ్రీన్ స్పెస్ ఇండెక్స్ కార్యక్రమం ద్వారా పురపాలక శాఖ మున్సిపాలిటీలో చేపట్టిన గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం అవార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇలాంటి ఒక పోటీతత్వాన్ని పురపాలికల మధ్య ఉంచడం ద్వారా గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాలు మరింత ఎక్కువ స్పూర్తితో పెద్ద ఎత్తున కొనసాగుతాయన్న ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పార్కుల అభివృద్ధి, మెక్కల పెంపకంలో వినూత్న డిజైన్లు, రోడ్ సైడ్ గ్రీనరీ పెంపకం మరియు ఇంటి మొక్కల పంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుత ఉన్న గ్రీన్ కవర్ ని మధించేందుకు జిఐఎస్ వినియోగం, ఉపగ్రహ చిత్రాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ వంటి పద్ధతుల ద్వారా రికార్డు చేసి రానున్న సంవత్సరం తర్వాత ఏ మేరకు ఆయా పట్టణాలు గ్రీన్ కవర్ పెరిగిందనే అంశాన్ని తిరిగి మధింపు చేస్తామన్నారు.

ఒక పట్టణంలో సంబంధించి ఉన్న మొత్తం గ్రీన్ కవర్ కు 85 శాతం వెయిటేజీ, మరో ఐదు శాతం గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు, మరో పది శాతం వివిధ డిజైన్లతో ఆకట్టుకునే విధంగా చేపట్టే ప్లాంటేషన్ కు వెయిటేజి ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తామన్నారు.స్థూలంగా పురపాలిక మెత్తానికి అవార్డుతోపాటు, అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిట, రోడ్డు సైడ్ మొక్కల పెంపకం వంటి ఇతర కేటగిరీలలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మొదలై మరో నాలుగేళ్లపాటు కొనసాగించాలని అనుకుంటున్నట్లు, ఆ లోపలే ప్రజలకు అవసరమైన గ్రీన్ కవర్ ని అన్ని పురపాలికల్లో ఏర్పాటు చేయాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కెటియార్ పేర్కొన్నారు.

- Advertisement -