తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసిన చారిత్రక శక్తి, భారత రాష్ట్ర సమితి (BRS) నేడు రజతోత్సవ సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని, పార్టీ ప్రస్థానాన్ని మరియు భవిష్యత్ లక్ష్యాలను చాటిచెప్పారు.
సరిగ్గా పాతికేళ్ల క్రితం, తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో ఉన్న వేళ, దగా పడ్డ జాతికి అండగా నిలబడేందుకు ఉద్భవించిన “గులాబీ జెండా” నేడు 26వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న కేసీఆర్కృషీవలుడి పాత్రను గుర్తు చేసుకున్నారు.25 ఏళ్ల క్రితం జలదృశ్యం వేదికగా, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఈ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే అది కేవలం స్వీయ రాజకీయ శక్తితోనే సాధ్యమని నాడు ఆయన నమ్మారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని కేటీఆర్ మూడు కీలక దశలుగా విశ్లేషించారు.ఉద్యమ పార్టీగా (మొదటి 14 ఏళ్లు): అంబేద్కర్ గారు చెప్పిన “బోధించు, సమీకరించు, పోరాడు” అనే సిద్ధాంతంతో లక్షలాది మందిని ఏకం చేసి, ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత ఈ పార్టీది.
అధికార పార్టీగా (తర్వాతి 10 ఏళ్లు): అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుంది. సాగునీరు, తాగునీరు, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది. నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వ అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా, ప్రజల గొంతుకై ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాం అన్నారు కేటీఆర్.
Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!
నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్ళీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు అని కేటీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఏ పాత్ర ఇచ్చినా ప్రజల కోసమే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

