ఐఏఎస్‌లకు తెలంగాణ కేస్‌స్టడీస్‌ సెంటర్‌గా మారింది :కేటీఆర్‌

30
ktr
- Advertisement -

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జిల్లా…నేడు ఐఏఎస్‌ లకు కేస్‌ స్టడీస్‌గా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులు బాగుచేయడం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల జిల్లా సుభిక్షంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం ఘననీయంగా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌ సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమాకాల ట్యాగ్‌లైన్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గడిచిన ఏనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఉద్యమ సహచరులంతా ఒకే వేదికపై కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో అంబేద్కర్‌ వర్సిటీలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు.

మన రాష్ట్రంలో రెండు జీవనదులతోపాటు 46 వేల చెరువులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కృషితో సాగునీటిరంగంలో ఘననీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 46 వేల చెరువులను బాగుచేసుకుంటే దాదాపు నాగార్జున సాగర్‌ కెపాసిటీ ఉంటుందని ఉద్యమనేత కేసీఆర్‌తోపాటు జయశంకర్‌ సార్‌ చెప్పేవారని గుర్తుచేశారు. చెరువులన్నింటినీ బాగుచేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. చెరువు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పారు. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని వెల్లడించారు. ఇంటింటికీ నీళ్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మిషన్‌ చెప్పిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని అన్నారు. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. శతాబ్దకాలం వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీళ్లందించేలా కాళేశ్వరాన్ని నిర్మించామని చెప్పారు.

సంక్షేమరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందని వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా.. ఏం తినాలి, ఏం వేసుకోవాలని డిక్టేట్‌ చేస్తున్నారని విమర్శించారు. మతం, కులం గురించి కొట్లాడుకోవడం వల్లే దేశం వెనుకబడిందని ఆరోపించారు. అయితే కులమతాలను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లకు చేరిందన్నారు.

టీహబ్‌, వీహబ్‌ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి తెలిపారు. అందుకే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఐటీ రంగంలో లక్షా 55 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. తద్వారా రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇదంతా కేవలం ప్రజామోదం పొందిన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడ చూసిన దొడ్డి దారిన ప్రభుత్వ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

- Advertisement -