నగరంలో రోడ్డు విస్తరణ, మౌళిక వసతులు కల్పన మీద పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ రోజు బంజరాహిల్స్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ రహదారుల శాఖ, అర్ అండ్ బి, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం అయ్యారు. నగరంలో చేపట్టాలనుకుంటున్న మూడు స్క్తైవేలను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికలు తయారు చేయాలని అదేశించారు.
రాజీవ్ రహదారిపై తూంకుంట వరకు కట్టే స్కైవేకు రక్షణ శాఖ భూముల అవసరం ఉన్న నేపథ్యంలో ఆ శాఖతో మరింత వేగంగా చర్చలు జరపాలని అదేశాలిచ్చారు. ఇక జాతీయ రహదారుల శాఖతోనూ చర్చలు నిర్వహించి నాగపూర్ హైవే పైన నిర్మించే స్కైవే విషయంలో పూర్తి స్థాయి స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రతి కారిడార్లో చేపట్టాల్సిన భూసేకరణ వివరాలను సిద్దంగా ఉంచాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కోరారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో చేస్తున్న ఎస్సార్డీపీ పనులు వేగవంతం చేయాలన్నారు. మూసి ప్రాంతంలో పలు ప్రయివేటు సంస్ధలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. 2691 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు యస్సార్డీపికి లభించాయని మంత్రి తెలిపారు. ఈ నిధుల్లో ప్రాధాన్యత కింద తీసుకోవాల్సిన పనులపైన ప్రత్యేకంగా ప్రణాళికలు వేయాలన్నారు. వీటితో పాటు నగరంలో రోడ్డు విస్తరణ, మెరుగుదల కోసం అవసరమైన మేరకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, అర్ అండ్ బి ఈయన్ సి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.