విశ్వనగరమైన హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాల శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫార్మూలా ఈ రేస్ నిర్వహణపై కూడా కేటీఆర్ సమీక్షించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం మరియు సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్వహణ, ఫుట్‌పాత్, కూడళ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలు ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరిన్ని లింకు రోడ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. నాలాల పురోగతి, పూర్తయిన నాలాల నిర్మాణ వివరాలను నగర పౌరుల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ఫార్మూలా ఈ రేస్ పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.