ప‌ట్ట‌ణాల్లో పారిశుధ్యంపై దృష్టిసారించండి : కేటీఆర్

308
ktr
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తన పరిధిలోని మునిసిపల్ మరియు ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో ఈరోజు మంత్రి కె. తారక రామారావు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు పట్టణాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సందర్భంగా పురపాలక శాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పారిశుద్ద్య సిబ్బంది మరియు వైద్య శాఖాధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతి పట్టణంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో, పట్టణాల్లో ఖాళీగా ఉన్న రోడ్లపైన మరమ్మతులను వేంటనే చేపట్టాలని, ప్రస్తుతమున్న లాక్ డౌన్ సమయాన్ని ఈ మరమ్మతుల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి అవకాశాల పైన కొన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో, 5 రూపాయల భోజనం (అన్నపూర్ణ కౌంటర్ల) కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా కౌంటర్ల వద్ద ఒకేసారి అందరు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఇల్లు లేని వారిని అయా పట్టణాల్లోని నైట్ షెల్టర్లకు తరలించాలని సూచించారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన లేదా కరోనా వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలిగి, ప్రస్తుతం హోం క్వారైంటైన్ లో ఉన్న పౌరులను ఇళ్లకే పరిమితం అయ్యేలా వారిపైన నిఘా ఉంచాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు.

పురపాలక శాఖ తో పాటు పరిశ్రమలు మరియు ఐటీ శాఖాధికారులతోనూ మాట్లాడిన మంత్రి తారక రామారావు, పారిశ్రామిక వాడలు మరియు ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తూ, పారిశుద్ద్యానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించారు. స్థానిక ఇండస్ర్టియల్ లోకల్ అథారిటీలు (ఐలాలు-ILA’s) దీని భాత్యతను తీసుకోవాలన్నారు. ఈ మేరకు టియస్ ఐఐసి అధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు రోజూవారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఉపయోగించేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కంపెనీలను కోరారు. ఈ నిధులను కరుణ వైరస్ నియంత్రణ కోసం ఉపయోగించేందుకు ఐటీ మరియు పరిశ్రమల శాఖ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలంతా ముఖ్యంగా పట్టణాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో ఈ డిమాండ్ ను తట్టుకునేందుకు అవసరం అయిన మేరకు బ్యాండ్విడ్త్ ని పెంచాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మంత్రి కెటియార్ కోరారు.

లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ఇలాంటి వారి విషయంలో పోలీసు సిబ్బంది కొంత సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో పాటు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిలకు మంత్రి కెటియార్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం స్పష్టమైన సూచనలు ఇవ్వాలని సూచించారు. అయితే ప్రస్తుతం సమాజమంతా ఆపత్కాలంలో ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని సూచించారు.

- Advertisement -