పురపాలక-ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ వార్షిక నివేదిక‌ విడుద‌ల చేసిన కేటీఆర్‌..

80
ktr

తెలంగాణ పురపాలక మరియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌కు సంబంధించి 2020-21 వార్షిక నివేదిక‌ను మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్, మున్సిప‌ల్ శాఖ‌ క‌మిష‌న‌ర్, డైరెక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. క‌రోనా వేళ ప‌ట్ట‌ణాల్లో మౌలిక స‌దుపాయాల ప‌నులు పూర్తి చేశామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప‌ట్ట‌ణాల్లో వ్య‌ర్థాలు, మాన‌వ వ్య‌ర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశామ‌ని పేర్కొన్నారు. మూసీ న‌దిపై 15 కొత్త బ్రిడ్జిల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. పీఎం స్వ‌నిధి అమ‌ల్లో దేశంలోనే ముందంజ‌లో ఉన్నామ‌న్నారు. వీధి వ్యాపారుల‌కు రూ. 347 కోట్ల రుణాలు ఇచ్చామ‌ని తెలిపారు. రూ. 184 కోట్ల‌తో దుర్గం చెరువుల తీగ‌ల వంతెన నిర్మించామ‌ని గుర్తు చేశారు.

అలాగే జీడిమెట్ల‌లో 500 టీపీడీ సామ‌ర్థ్యంతో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల ప్లాంట్ ఏర్పాటు చేశామ‌ని మంత్రి పేర్కొన్నారు. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో చెత్త నుంచి 19.8 మెగావాట్ల సామ‌ర్థ్యంతో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఓఆర్ఆర్ పై 136 కిలోమీట‌ర్ల పొడ‌వునా ఎల్ఈడీ దీపాలు, 10 ట్రామా ర‌క్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. రూ. 30 కోట్ల‌తో ట్యాంక్‌బండ్‌పై సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.