కేంద్రం శనివారం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో ఐదుగురు తెలుగువాళ్లకు పురస్కారం లభించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉండడం విశేషం. వారిలో పీవీ సింధు ‘పద్మభూషణ్’ (క్రీడాలు), శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)లకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు.
అయితే ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడకు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. సింధుకు అవార్డు రావడం మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కరీంనగర్‌కు చెందిన శ్రీభాష్యం విజయసారథికి, హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకటరెడ్డికి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. విజయసారథికి ఈ గౌరవం లభించడం ఆయన చేసిన సాహిత్య కృషికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. ద్రాక్ష పంట సాగులో వినూత్నమైన మెలకువలతో, అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి అని కొనియాడారు.