పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మధ్య శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అతను మాత్రం తన సొంత ఆలోచనలతో సంపాదించడమే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ల సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, నగర పాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కెటిఆర్ కి సోమవారం అందచేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూర్వ వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటలో పుట్టి పెరిగిన కామిడి నర్సింహారెడ్డి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయితే చాలా మందిలా తన పుట్టిన ఊరిని మరచిపోలేదు. తను పుట్టిన ఊరుకు ఏదో చేయాలనే ఆలోచన ఆయనని తొలుస్తూ ఉండేది. కానీ, సందర్భం దొరకలేదు. ఏదో విధంగా సాయమైతే చేయాలనుకున్నారు. అనుకోకుండా… పల్లెలను స్వయం సమృద్ధం చేయాలని, పచ్చదనం-పరిశుభ్రతలతో ఆదర్శంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన సిఎం కెసిఆర్, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇదే సరైన సమయంగా భావించిన కామిడి నర్సింహారెడ్డి తన ఊరు దమ్మన్నపేట గ్రామానికి రూ. 25 కోట్ల విరాళాన్ని స్వచ్ఛందంగా ప్రకటించారు. ఈ వార్త సంచలనంగా మారింది. అంతా కామిడి నర్సింహారెడ్డిని అభినందించారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ సందర్బంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారు ప్రత్యేకంగా కామిడి నర్సింహారెడ్డి గారి ఔదార్యాన్ని ప్రకటించి, కొనియాడారు. అంతకుముందు సిఎం కెసిఆర్ సైతం నర్సింహారెడ్డి దాన గుణాన్ని మెచ్చుకున్నారు.
అయితే, తాను ప్రకటించిన విరాళంలో భాగంగా రూ.1.50 కోట్లను ఇవాళ సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ల సమక్షంలో కెటిఆర్ ని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందచేశారు. ఈ విరాళాన్ని వర్దన్నపేట మండల కేంద్రంలోని వైద్యశాల అభివృద్ధికి వినియోగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలని నర్సింహారెడ్డి కోరారు.
అయితే, కామిడి నర్సింహారెడ్డి ధాతృత్వాన్ని ఐటీ, పరిశ్రమలు, నగర పాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. ఉన్న ఊరుని, కన్న తల్లిని మరవని వాళ్ళే నిజమైన మనిషి అన్నారు. కాగా, కామిడి నర్సింహారెడ్డి ఔదార్యం ప్రపంచానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కామిడి నర్సింహారెడ్డిలాగా తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు, ఇతర శ్రీమంతులు సహకరించాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఇలా పల్లెల ప్రగతికి తోడ్పడుతున్నదని, ఈ ఘనత సీఎం కెసిఆర్ దేనని మంత్రి దయాకర్ రావు అన్నారు.