భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను బహిరంగంగా అంగీకరించడమే కాకుండా, రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాన్ని స్పష్టం చేశారు.2027లో జనంలోకి కేటీఆర్ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు 2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ పుంజుకునేలా చేసేందుకు ఈ యాత్ర కీలకమని ఆయన భావిస్తున్నారు.మేం చేసిన తప్పులు ఇవే..గత పదేళ్ల పాలనలో జరిగిన కొన్ని వైఫల్యాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కిందిస్థాయి నేతలను దూరం చేసుకోవడం పార్టీకి నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యామని అంగీకరించారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి లక్షలాది మంది గల్ఫ్‌లో ఉంటున్నా.. వారి కోసం సరైన గల్ఫ్ పాలసీ తీసుకురాలేకపోయామని వాపోయారు. మా పాలనలో జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామన్నారు. సింగరేణి ఎన్నికలు (టీజీబీకేఎస్) వంటి అంశాల్లో ముందే అప్రమత్తమై ఉంటే అసెంబ్లీలో మరిన్ని సీట్లు గెలిచేవాళ్ళమని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదు. గతంలోనూ ఒంటరిగానే గెలిచాం, ఇక ముందు కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, ఇది బీఆర్ఎస్ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన విశ్లేషించారు. మే, జూన్ నెలలుపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం ఉంటుందని… కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు, పార్టీ బలోపేతంపై దృష్టి చేస్తామన్నారు. గతాన్ని పాఠంగా మార్చుకుని, భవిష్యత్తులో కార్యకర్తలే సైన్యంగా ముందుకు సాగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

