ఆటో డ్రైవర్లను ఆదుకోండి…కేటీఆర్ బహిరంగలేఖ

18
- Advertisement -

ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే.. రాష్ట్రంలో రోజురోజుకూ ఆటోడ్రైవర్ల సంక్షోభం తీవ్రమవుతోందన్నారు.

గత పదేళ్లు తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం మీ 55 రోజుల పరిపాలనలో సమాజాంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారు. ఇంతకాలం చెమటోడ్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారింది. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్ర అంటూ ఆవేదన చెందుతున్నారు.

ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోంది. ఆటోలు ఎక్కే వాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలో అర్థంకాక మానసిక వేదన అనుభవిస్తున్నారు. వీటికి తోడు కిరాయి ఆటోలు నడుపుకునే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరం. అద్దెకు తెచ్చిన ఆటో కిరాయి పైసలు కూడా రాకపోవడంతో.. ఇక బతుకు బండిని లాగేదెలా అని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. ఇక అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్న డ్రైవర్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే… గురువారం ఒక గిరిజన ఆటోడ్రైవర్ సోదరుడు ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్న సంఘటన చూసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది.

రెండు నెలలు నిండని మీ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు దాదాపు 15 మంది డ్రైవర్ అన్నలు ఆత్మహత్యల చేసుకోవడం అత్యంత బాధాకరం. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా ఆటోడ్రైవర్ల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలోనే మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని వేశాం. ఆటో సంఘాలు, డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వాటన్నంటినీ ఒక నివేదిక రూపంలో తయారుచేసి మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించాం. కానీ ఇప్పటివరకు మీ ప్రభుత్వం వైపు నుంచి దానిపై స్పందించిన పాపాన పోలేదు.

అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా.. పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని 6.50 లక్షలాది మంది ఆటోడ్రైవర్ల పక్షాన కోరుతున్నాను. మీ అనాలోచిత విధానాల వల్ల గత రెండు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ మీ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అందుకే రాష్ట్రంలో ఉన్న ఆరున్నర లక్షల మంది డ్రైవర్లకు ప్రతినెలా 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 15 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొ కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను.

ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలు తనకు తెలుసు అంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అటో డ్రైవర్లతో సమావేశం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో వార్తలకు చూపిన తాపత్రయం, వారి సమస్య పరిష్కారానికి చూపలేదు. ఈ సమావేశం తర్వతా ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆటోడ్రైవర్లను విస్తృతంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ, తీరా గట్టెక్కాక వారి జీవితాలతో ఇలా చెలగాటమాడటం అత్యంత దుర్మార్గమైన చర్య.

ప్రజాభవన్ అని పేరు మారిస్తే సరిపోదు. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పుపెట్టుకున్నా.. ముఖ్యమంత్రి ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరం.

అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుక వినిపిస్తున్నాం. ఆటోడ్రైవర్లను అన్నివిధాలా ఆదుకోవాలని మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఆటోడ్రైవర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం అన్నారు.

Also Read:షర్మిల దీక్ష.. ఎవరికి లాభం ఎవరికి నష్టం?

- Advertisement -